ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 15 October 2026, 3:30 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

విద్యుత్‌ కోతలపై సీఎం ఆగ్రహం.. యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌ చీఫ్‌ ఇంజినీర్‌ సస్పెన్షన్‌విద్యుదుత్పత్తి పెంపు పనుల్లో నిర్లక్ష్యంపై టీజీ జెన్‌కో చర్యలు.

విద్యుత్‌ కోతలపై సీఎం ఆగ్రహం.. యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌ చీఫ్‌ ఇంజినీర్‌ సస్పెన్షన్‌విద్యుదుత్పత్తి పెంపు పనుల్లో నిర్లక్ష్యంపై టీజీ జెన్‌కో చర్యలు.

ఉన్నతాధికారులపైనా చర్యలు తప్పవని రేవంత్‌రెడ్డి హెచ్చరిక,

అర్జున్ సమాచారం // అక్టోబర్ 15 // హైదరాబాద్‌:

తెలంగాణలో విద్యుత్‌ కోతలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో విద్యుత్‌ శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలతో యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (వైటీపీఎస్‌) స్టేజ్‌-1 చీఫ్‌ ఇంజినీర్‌ బి. సురేశ్‌ను టీజీ జెన్‌కో సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు సంస్థ సీఎండీ డాక్టర్‌ ఎస్‌. హరీశ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

విద్యుదుత్పత్తిని పెంచేందుకు చేపట్టాల్సిన ప్రాధాన్య పనుల ప్రణాళిక, పర్యవేక్షణ, అమలులో చీఫ్‌ ఇంజినీర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. శాఖాపరమైన విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్‌ అమల్లో ఉండనుంది.

విద్యుదుత్పత్తిపై సీఎం ప్రశ్నలు

బుధవారం సాయంత్రం ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా పరిస్థితిపై ఆరా తీశారు. నైనీ, మహానది బొగ్గు బ్లాకుల నుంచి బొగ్గు సరఫరా అందుబాటులో ఉన్నప్పటికీ యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో పూర్తి సామర్థ్యంతో విద్యుదుత్పత్తి ఎందుకు జరగడం లేదని అధికారులను ప్రశ్నించారు. విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా వ్యవహారాల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు.

విద్యుత్‌ కోతల సమస్య పరిష్కారానికి పలుమార్లు ఆదేశాలు ఇచ్చినా ఆశించిన మార్పు కనిపించకపోవడంపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం కొనసాగితే ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌, టీజీ జెన్‌కో సీఎండీ ఎస్‌. హరీశ్‌పైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలి

రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటలు ఎండిపోకుండా వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. పంట చేతికొచ్చే వరకు విద్యుత్‌ కోతలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. రానున్న 20 రోజులు పంటలకు అత్యంత కీలకమని, విద్యుత్‌ కొరత కారణంగా రైతులు నష్టపోయే పరిస్థితి రాకూడదని సూచించారు.

వ్యవసాయ విద్యుత్‌ డిమాండ్‌ అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ సరఫరాను మెరుగుపర్చాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో లోటు వర్షపాతం, ఎల్‌నినో ప్రభావం, విద్యుత్‌ సరఫరా, తాగునీటి లభ్యత వంటి అంశాలపైనా సమీక్ష నిర్వహించారు.

నిర్లక్ష్యంపై కఠిన చర్యల సంకేతం

ప్రజలకు ఇబ్బందులు కలిగించే అధికారుల నిర్లక్ష్యాన్ని సహించబోనని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు తాను జవాబుదారీగా ఉన్నానని పేర్కొంటూ, విద్యుత్‌ సరఫరా మెరుగుదలకు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు.

విద్యుత్‌ కోతల నేపథ్యంలో చీఫ్‌ ఇంజినీర్‌ సస్పెన్షన్‌ నిర్ణయం తీసుకోవడం విద్యుత్‌ శాఖలో చర్చనీయాంశంగా మారింది. రాబోయే రోజుల్లో విద్యుదుత్పత్తి, వ్యవసాయానికి సరఫరా, అధికారుల పనితీరుపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.